two weeler: రెండో హెల్మెట్ షాక్ మొదలు... అమలు చేస్తున్న తెలంగాణ పోలీసులు!
- ఇద్దరూ పెట్టుకోకుంటే రూ.వంద జరిమానా
- అయోమయానికి గురవుతున్న ద్విచక్ర వాహన చోదకులు
- ప్రతిపాదనే అన్నారు...అప్పుడే అమలేంటని ప్రశ్న
ద్విచక్ర వాహన చోదకులకు తెలంగాణ పోలీసులు షాకిస్తున్నారు. వెనుక కూర్చున్న వ్యక్తులకు హెల్మెట్ లేకుంటే రూ.వంద జరిమానా విధించి రశీదు చేతుల్లో పెడుతున్నారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని, లేదంటే అటువంటి వారికి జరిమానా విధించాలని తెలంగాణ రవాణాశాఖ యోచిస్తోందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వాహన చోదకులు భావిస్తుంటే, పోలీసులు మాత్రం బాదుడు మొదలు పెట్టేశారు. దీంతో వాహన చోదకులు అయోమయానికి గురవుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నిబంధన అమలు చేస్తున్న పోలీసులు ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలు అని చెబుతున్నారు.