chidambaram: బడ్జెట్ పై 1 నుంచి 10 వరకూ రేటింగ్ ఆడిగితే... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన పీ చిదంబరం!

  • శనివారం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
  • పూర్తిగా వ్యతిరేకించాల్సిందేనన్న చిదంబరం
  • ఎవరికీ ఉపశమనం లేదని విమర్శలు

2020-21 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను శనివారం నాడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ ముందుకు తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ పై పలువురు విపక్ష నేతలు పెదవి విరిచారు. తాజాగా, ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరాన్ని బడ్జెట్ పై స్పందించాలని మీడియా కోరిన వేళ, ఆయన దిమ్మతిరిగే సమాధానాన్ని ఇచ్చారు.

నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై 1 నుంచి 10 లోపు ఎంత స్కోరు ఇస్తారని అడుగగా, "పది సంఖ్యలో రెండు అంకెలుంటాయి. అవి 1, 0. ఏది ఇస్తారో మీరే నిర్ణయించుకోండి" అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తిగా వ్యతిరేకించాల్సినవేనని ఆయన అభిప్రాయపడ్డారు. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి లేకుండా వృద్ధిని ఎలా పెంచుతారని ఆయన ప్రశ్నించారు. డిమాండ్ కు అనుగుణంగా పెట్టుబడుల ఆకర్షణకు చర్యలను ప్రకటించడంలో కేంద్రం విఫలమైందని నిప్పులు చెరిగారు.

"ఆర్థిక మంత్రి రెండు ప్రధాన సవాళ్లను మరిచిపోయారు. ఈ రెండు సవాళ్లను ఎలా అధిగమిస్తామన్న విషయాన్ని ఆమె ప్రస్తావించలేదు. ఇవి రెండూ ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరిచేవే. దేశంలోని కోట్లాది మంది పేదలకు, మధ్య తరగతి వర్గాలకూ ఈ బడ్జెట్ ఏ విధమైన ఉపశమనాన్నీ కలిగించలేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

chidambaram
budget
Nirmala Sitharaman
Rating
  • Loading...

More Telugu News