Corona Virus: చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి...జ్వరమని ప్రత్యేక విమానంలోకి నిరాకరణ!
- ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు
- టీసీఎల్ ఉద్యోగ శిక్షణ కోసం అక్కడికి వెళ్లిన యువతి
- ఈ నెల 14న అమె వివాహం
ఉద్యోగంలో భాగంగా ఇచ్చే శిక్షణ కోసం చైనా వెళ్లిన కర్నూల్ జిల్లాకు చెందిన యువతి అక్కడ చిక్కుకుపోయింది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా కల్లోలం ఆందోళన చెందే రీతిలో ఉండడంతో భారత్ కు తిరిగి రావాలన్న ఈమె ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం ఈ యువతి జ్వరంతో బాధపడుతుండడంతో భారతీయులను తెచ్చేందుకు పంపిన ప్రత్యేక విమానంలోకి విమాన సిబ్బంది ఈమెను అనుమతించలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్న ఈ యువతి తన ఆవేదన తెలియజేస్తూ తల్లికి వీడియో పంపింది. ఈ వీడియోను చూసి కర్నూల్ లో ఉన్న ఆమె తల్లి తీవ్ర ఆందోళన చెందుతోంది.
బండి ఆత్మకూరు మండలం ఈర్లపాడు గ్రామానికి చెందిన అన్నెం శృతి టీసీఎల్ ఉద్యోగి. మూడు నెలల శిక్షణ కోసం సహచరులు 58 మందితో కలిసి చైనా వెళ్లింది. ప్రస్తుతం ఆమె జ్వరంతో బాధపడుతుండడంతో అక్కడి అధికారులు కూడా పంపేందుకు ఒప్పుకోవడం లేదు.
ఇటీవలే శృతికి నిశ్చితార్థం జరిగింది. ఆమె వివాహం ఈ నెల 14న జరగాల్సి ఉంది. శిక్షణ కోసం వుహాస్‌కు వెళ్లిన 58 మందిలో ఇద్దరు మాత్రమే అక్కడ నిలిచిపోయారు. ఆమెను వూహాస్ నుంచి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.