vro: తహశీల్దార్ కార్యాలయంలోనే వీఆర్వోను చెప్పుతో కొట్టిన రైతు!
- అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఘటన
- తల్లి పేరున కాకుండా చిన్నాన్న పేరున పట్టా చేసిన వీఆర్వో
- వీఆర్వోతో వాగ్వివాదం..ఆపై దాడి
భూమి పట్టా మార్పు విషయంలో వీఆర్వోతో జరిగిన వాగ్వివాదం మరింత ముదరడంతో ఓ రైతు వీఆర్వోను చెప్పుతో కొట్టాడు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో జరిగిందీ ఘటన. వీఆర్వో ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రైతును అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నీలంపల్లికి చెందిన నాగభూషణం, అన్న నాగప్పలకు సర్వే నంబరు 24లో 80 సెంట్ల భూమి ఉంది. ఇది నాగభూషణం తండ్రి ఎల్లప్ప పేరుపై ఉంది. ఇటీవల ఆయన మృతి చెందడంతో ఆ భూమి పట్టాను తన తల్లి వన్నూరమ్మ పేరున మార్చాలని వీఆర్వో కుమారస్వామికి నాగభూషణం దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే, రోజులు గడుస్తున్నా పనిచేసి పెట్టకుండా తిప్పించుకుంటున్నాడు. తాజాగా, ఆ భూమి పట్టాను తన చిన్నాన్న పేరున చేసినట్టు తెలుసుకున్న నాగభూషణం నిన్న తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ కుమారస్వామిని కలిసి వాగ్వివాదానికి దిగాడు. అది మరింత ముదరడంతో నాగభూషణం చెప్పు తీసుకుని వీఆర్వోపై దాడిచేశాడు. వీఆర్వో ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగభూషణాన్ని అదుపులోకి తీసుకున్నారు.