Budget 2020: డిపాజిట్లకు మరింత బీమా.. మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పిన నిర్మలమ్మ!
- బీమా కవరేజి రూ. 5 లక్షల వరకు పెంపు
- గతంలో రూ.1 లక్ష వరకే బీమా సౌకర్యం
- బ్యాంకులు చెల్లించే ప్రీమియంతోనే ఈ సదుపాయం వర్తింపు
బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజిని రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఇప్పటివరకు ఈ బీమా గరిష్టంగా రూ.1 లక్ష వరకు మాత్రమే పొందే వీలుండేది. ఇప్పుడు దాన్ని రూ.5 లక్షల వరకు పెంచారు.
బ్యాంకులు ఖాతాదారులకు సొమ్ము చెల్లించడంలో విఫలమైన పక్షంలో ఈ మేరకు బీమా సౌకర్యం వర్తింపజేస్తారు. దీనికోసం ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించనవసరంలేదు. బ్యాంకులు చెల్లించే ప్రీమియంతోనే నిర్దేశిత గరిష్ఠ మొత్తం వరకు బీమా లభిస్తుంది. పొదుపు, రికరింగ్, కరెంట్ అకౌంట్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈ బీమా పొందవచ్చు. ఈ బీమాను ఆర్బీఐకి చెందిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) అందిస్తుంది.