Visakhapatnam: విశాఖ నగరంలో భారీ వర్షం

  • రెండు విడతల్లో దాదాపు మూడు గంటలపాటు జోరువాన
  • చడీచప్పుడు లేకుండా వచ్చేసిన వరుణ దేవుడు 
  • పలుచోట్ల జలమయమైన రోడ్లు

మేఘాలు లేవు. ఉరుములు మెరుపుల హడావుడి కనిపించలేదు. కనీసం గాలి కూడా వీయలేదు. కానీ దాదాపు మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షంతో విశాఖ నగరవాసులు ఆశ్చర్యపోయారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. రథసప్తమి ముందురోజు కావున ఆనవాయితీగా కురిసే జల్లులే అని అనుకున్నారు. రాత్రి ఎనిమిది గంటలయ్యేసరికి వర్షం క్రమేపీ పెరగడం మొదలయ్యింది. దీంతో రాకపోకలు జోరుగా సాగే సమయం కావడంతో నగరవాసులు చాలా ఇబ్బంది పడ్డారు.

ముఖ్యంగా కార్యాలయాల నుంచి , వృత్తి వ్యాపారాలను పూర్తిచేసుకుని వచ్చేవారు ఇబ్బంది పడ్డారు. రాత్రి తొమ్మిది గంటల సమయానికి భారీ వర్షం మొదలయ్యింది. ఏకధాటిగా 40 నిమిషాలపాటు కురిసింది. రెండో విడతలో రాత్రి 11.30 గంటల సమయంలో ప్రారంభమైన భారీ వర్షం అర్ధరాత్రి దాటి 2.30 గంటల వరకు కురిసింది.

భారీ స్థాయిలో కురిసిన ఈ అకాల వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరం మీదుగా వెళ్తున్న నాలుగులేన్ల రహదారిలో అక్కయ్యపాలెం, హనుమంతవాక తదితర ప్రాంతాల్లో రోడ్డుపై అడుగు నుంచి రెండు అడుగుల ఎత్తున నీరు నిలిచిపోయింది.

భారీవర్షం ఏకధాటిగా కురవడంతో రోడ్డుపై నీరు కాలువల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన మార్గాల సామర్థ్యం సరిపోక పలు లోతట్టు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎదురయ్యింది. అర్ధరాత్రి దాటిపోవడంతో జనం పెద్దగా ఇబ్బంది పడకున్నా వాహన చోదకులు మాత్రం నానాపాట్లు పడ్డారు.

  • Loading...

More Telugu News