Wuhan: వుహాన్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు జంబో విమానాన్ని పంపిన కేంద్రం
- ఢిల్లీ నుంచి వుహాన్ బయల్దేరిన బోయింగ్ 747 విమానం
- 432 మందిని తరలించగలిగే సామర్థ్యం ఈ విమానం సొంతం
- శనివారం వుహాన్ వెళ్లనున్న మరో విమానం
చైనాలో కరోనా వైరస్ హడలెత్తిస్తున్న నేపథ్యంలో అక్కడున్న విదేశీయులు ఎప్పుడెప్పుడు స్వదేశాలకు వెళ్లిపోదామా అని ఆరాటపడుతున్నారు. కరోనా వైరస్ కు కేంద్రస్థానంగా భావిస్తున్న వుహాన్ నగరంలో భారతీయులు సుమారు 400 మంది ఉన్నట్టు అంచనా. ఇప్పుడు వాళ్లందరినీ తీసుకొచ్చేందుకు ఎయిరిండియాకు చెందిన భారీ విమానం జంబో బి747ను కేంద్రం చైనాకు పంపింది.
ఈ బోయింగ్ విమానం ఢిల్లీ నుంచి ఈ మధ్యాహ్నం బయల్దేరింది. వుహాన్ నుంచి 400 మంది భారతీయులను ఈ విమానం ద్వారా భారత్ తరలిస్తారు. ఈ బి747 జంబో విమానం శనివారం వేకువజామున తిరిగి ఢిల్లీ చేరుకోనుంది. ఈ విమానంలో మొత్తం 432 మంది ప్రయాణించే వీలుంది. కాగా, శనివారం చైనాకు మరో విమానాన్ని పంపించనున్నారు. చైనా నుంచి భారత్ చేరుకోనున్న వ్యక్తులను 14 రోజుల పాటు ప్రత్యేక వార్డులో ఉంచి పరిశీలించనున్నారు.