YSRCP: హిందూపురంలో తనకు ఎదురైన చేదు అనుభవంపై బాలకృష్ణ స్పందన
- అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారంటూ నిన్న స్థానికుల నిరసన
- నిన్న ఒక్క సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేది? అని బాలయ్య ప్రశ్న
- కానీ, చట్టంపై తమకు గౌరవం ఉందని వ్యాఖ్య
తన సొంత నియోజక వర్గం హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు నిన్న చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్న కొందరు వ్యక్తులు.. ఏపీలో అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారంటూ బాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపు చేశారు. దీనిపై బాలకృష్ణ స్పందించారు. తాను నిన్న ఒక్క సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేది? అని ఆయన ప్రశ్నించారు. కానీ, చట్టంపై తమకు గౌరవం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, రాయలసీమలో హైకోర్టును బాలకృష్ణ అడ్డుకుంటున్నారంటూ స్థానికులతో కలిసి వైసీపీ నేతలు, కార్యకర్తలు నిన్న ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఆయనను రాయలసీమ ద్రోహి అంటూ, వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణకు మద్దతుగా నిలవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.