CAA: జామియా కాల్పుల ఘటన: బడికెళ్తున్నానని ఇంట్లో చెప్పి.. ఆందోళనకారులపై విద్యార్థి కాల్పులు
- జామియాలో కాల్పులు జరిపింది 11వ తరగతి విద్యార్థి అన్న పోలీసులు
- ఆందోళన చేస్తున్న వారిపై దాడి చేసేందుకే తుపాకీ కొన్నాడు
- ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయట్లేదు
- తనకు ఏ సంస్థతోనూ సంబంధాలులేవని చెప్పిన విద్యార్థి
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వద్ద సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపి కలకలం రేపిన విషయం తెలిసిందే. అతడిని అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతోన్న పోలీసులు పలు విషయాలు తెలిపారు.
నిందితుడి పేరు రామ్ భగత్ గోపాల్ శర్మ అని, అతడు 11వ తరగతి విద్యార్థి అని చెప్పారు. ఆందోళన చేస్తున్న వారిపై దాడి చేసేందుకే ఆ కుర్రాడు తుపాకీ కొన్నాడని తేల్చారు. బడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన ఆ విద్యార్థి నిన్న మధ్యాహ్నం జామియా వద్దకు చేరుకున్నాడని, ర్యాలీ చేస్తోన్న వారి వద్దకు వచ్చి 'ఇదిగో మీ స్వేచ్ఛ' అంటూ కాల్పులు జరిపాడని వివరించారు.
ఈ చర్యకుగానూ నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయట్లేదని పోలీసులు తెలిపారు. తనకు ఏ సంస్థతోనూ సంబంధాలులేవని అతడు చెప్పాడని తెలిపారు. రెండేళ్లుగా ఆ విద్యార్థి సామాజిక మాధ్యమాల్లో హింసాత్మక వీడియోలు చూశాడని చెప్పారు. రెండేళ్ల క్రితం కాస్‌గంజ్ అల్లర్లలో అతడి స్నేహితుడు చందన్ గుప్తా మృతి చెందాడని, స్నేహితుడి మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకే కాల్పులు జరిపాడని పోలీసులు గుర్తించారు.