Jamia Millia Islamia university: ఢిల్లీ జామియా వర్శిటీలో సీఏఏ నిరసనకారులపై కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తి... తీవ్ర ఉద్రిక్తత
- జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో కాల్పులు
- కాల్పుల్లో గాయపడ్డ ఓ విద్యార్థి
- ఆగంతుకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనలో యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో, యూనివర్శిటీలో భయానక పరిస్థితి నెలకొంది.
తెల్ల రంగు ప్యాంటు, నల్లటి రంగు జాకెట్ ధరించిన ఆ వ్యక్తి... భారీగా పోలీసులు ఉన్న రోడ్డుపై నుంచే నింపాదిగా నడుచుకుంటూ వచ్చి కాల్పులు జరిపినట్టు ఓ వీడియోలో రికార్డ్ అయింది. కాల్పులు జరుపుతున్న సందర్భంగా... 'మీ స్వాతంత్ర్యం ఇదిగో' అంటూ అతను గట్టిగా అరిచాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు... ఆగంతుకుడు కాల్పులు జరపడం పూర్తి కాగానే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆమ్నా ఆసిఫ్ అనే విద్యార్థిని మాట్లాడుతూ, బ్యారికేడ్లకు సమీపంలో తాము ప్రశాంతంగా ర్యాలీని నిర్వహిస్తున్న సమయంలో హఠాత్తుగా అక్కడకు వచ్చిన ఆగంతుకుడిని తాము గుర్తించలేదని చెప్పింది. రివాల్వర్ ను చేతిలో పట్టుకుని అతను తమ వైపుగా ముందుకు కదిలాడని తెలిపింది. అతన్ని ఆపేందుకు తాము యత్నించామని చెప్పింది.
పోలీసులు అక్కడే ఉన్నారని, అతన్ని ఆపాల్సిందిగా పోలీసులను కోరామని... కానీ, పోలీసులు స్పందించలేదని వెల్లడించింది. దీంతో ఆగంతుకుడి నుంచి రివాల్వర్ ను లాక్కునేందుకు తాము ప్రయత్నించగా... తమ స్నేహితుల్లో ఒకరిపై అతను కాల్పులు జరిపాడని చెప్పింది. అతను విద్యార్థుల్లో ఒకడు కాదని, కచ్చితంగా బయట నుంచి వచ్చిన వ్యక్తి అని తెలిపింది.
మరోవైపు, కాల్పుల్లో గాయపడ్డ షాదాబ్ అనే విద్యార్థిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను ఆపేశారు.