Sharjeel Imam: ఔను.. ఆ వీడియో ఒరిజినల్: పోలీసుల విచారణలో ఒప్పుకున్న షర్జిల్ ఇమాం
- రెచ్చగొట్టే ప్రసంగం చేసిన జేఎన్యూ విద్యార్థి షర్జిల్ ఇమామ్
- మంగళవారం బీహార్ లో అరెస్ట్ చేసిన పోలీసులు
- క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి అప్పగించిన ఢిల్లీ హైకోర్టు
సీఏఏకి వ్యతిరేకంగా విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేసిన ఢిల్లీలోని జేఎన్యూ విద్యార్థి షర్జిల్ ఇమామ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతన్ని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా తాను రెచ్చగొట్టే ప్రసంగం చేశానని షర్జిల్ ఒప్పుకున్నాడు. తన ప్రసంగానికి సంబంధించిన వీడియో నిజమైనదని చెప్పాడు. తన ప్రసంగం దాదాపు గంటసేపు కొనసాగిందని... కానీ వైరల్ అవుతున్న వీడియో మాత్రం ఎడిట్ చేసినదని తెలిపాడు. ఆ సమయంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే తాను అలా మాట్లాడానని చెప్పాడు.
అయితే, ఉద్దేశపూర్వకంగానే షర్జిల్ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడని క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ అధికారులు భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా అతని ప్రసంగం కొనసాగిందని అంటున్నారు. తాను చేసిన ప్రసంగం పట్ల షర్జిల్ పశ్చాత్తాప పడటం లేదని, తన నిరసనలను కొనసాగించాలనే యోచనలోనే ఉన్నాడని చెబుతున్నారు. మరోవైపు, క్రైమ్ బ్రాంచ్ కు షర్జిల్ ను ఐదు రోజుల కష్టడీకి ఢిల్లీ హైకోర్టు నిన్న అప్పగించింది. బీహార్ లోని జెహనాబాద్ లో మంగళవారం నాడు షర్జిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.