Crime News: తన భర్తతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తోటికోడలి హత్య!

  • ఒకే భవనంలో ఉంటున్న అన్నదమ్ముల కుటుంబాలు
  • పెట్రోల్ పోసి నిప్పంటించిన మరిది భార్య
  • తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృతి

విశాఖనగరంలో ఘోరం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు, అనుమానం నేపథ్యంలో స్వయానా తోటికోడలినే హత్య చేసిందో మహిళ. పోలీసుల కథనం మేరకు... గ్రేటర్ విశాఖ 66వ వార్డు గోపాలపట్నానికి సమీపంలోని కొత్త పాలేనికి చెందిన దాడి గణేష్, వెంకటరమణ అన్నదమ్ములు. ప్లంబింగ్ పనులు చేసుకుంటూ ఇద్దరూ జీవనోపాధి పొందుతున్నారు.

ఒకే భవనంలో కింద, పై అంతస్తుల్లో నివాసం ఉంటున్నారు. చిన్నవాడైన వెంకటరమణ భార్య పావని (30), పెద్దవాడైన గణేష్ భార్య రామలక్ష్మి (35)కి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. తన భర్తతో రామలక్ష్మికి వివాహేతర సంబంధం ఉందన్నది పావని అనుమానం. ఈ కారణంగానే తరచూ రామలక్ష్మితో గొడవపడేది. 

ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మేడ పై మిషన్ కుడుతున్న రామలక్ష్మి వద్దకు పావని వెళ్లింది. ఆమెతో వాగ్వాదానికి దిగింది. అదే సమయంలో తనతో తెచ్చిన పెట్రోలు రామలక్ష్మిపై పోసి నిప్పంటించింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పెనుగులాట జరగడం, మంటలకు ఆ గదిలోని గృహోపకరణాలు కూడా అంటుకోవడంతో తోటికోడళ్లు ఇద్దరూ గాయపడ్డారు. తీవ్రగాయాలతో మేడపై నుంచి దొర్లుకుంటూ వచ్చి రామలక్ష్మి తొలుత పడిపోగా, ఆ తర్వాత పావని కూడా మంటల్లో చిక్కుకుని కిందకు పరుగున వచ్చింది.

అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన స్థానికులు హుటాహుటిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కేజీ హెచ్ లో చికిత్స పొందుతూ రామలక్ష్మి చనిపోగా, పావని 40 శాతం గాయాలతో చికిత్స పొందుతోంది. చనిపోయే ముందు రామలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పావని ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిందని తేలడంతో పోలీసులు ఆ దిశగా కేసు నమోదు చేశారు. తన భర్తతో రామలక్ష్మికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే పావని ఈ దుశ్చర్యకు పాల్పడిందన్న వాదన  వినిపిస్తోంది.

Crime News
Visakhapatnam
Fire Accident
one dead
  • Loading...

More Telugu News