VV Lakshminarayana: సర్వేలో పాల్గొనండి.. విశాఖను అగ్ర స్థానంలో నిలపండి: జనసేన లక్ష్మీ నారాయణ విన్నపం
- భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో విశాఖవాసులంతా పాల్గొనాలి
- మన అభిప్రాయాలను సర్వే ద్వారా వెల్లడించాలి
- దేశంలోనే స్వచ్ఛమైన నగరంగా విశాఖకు తొలి స్థానం దక్కే అవకాశం ఉంది
దేశ వ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో విశాఖను ప్రతిపాదించి మొదటి స్థానంలో నిలబెట్టాలని నగరవాసులకు జనసేన నేత, సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ విన్నవించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. విశాఖ వాసులకు ఆయన చేసిన విన్నపం ఆయన మాటల్లోనే విందాం.
"విశాఖ ప్రజలందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే స్వచ్ఛంగా ఉన్న నగరాలకు ఒక పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో మనమంతా పాల్గొని మన నగరాన్ని స్వచ్ఛమైన నగరంగా ప్రతిపాదించడానికి ఒక అవకాశం ఉంది.
దీని కోసం మనం చేయాల్సింది ఇదే. మొదట స్మార్ట్ ఫోన్ లోని యాప్ స్టోర్ ద్వారా mohua swachhata అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో సిటిజన్ సర్వే అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 8 ప్రశ్నలు ఉంటాయి. ఆ 8 ప్రశ్నలకు సమాధానాలిస్తూ మన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి.
మనమంతా మన అభిప్రాయాలను పంపిస్తే.. మన నగరానికి స్వచ్ఛమైన నగరంగా దేశంలోనే నెంబర్ వన్ స్థానం దక్కే అవకాశం ఉంది. ఈ సర్వేలో విశాఖవాసులంతా పాల్గొంటారని ఆశిస్తున్నాను" అని లక్ష్మీనారాయణ విన్నవించారు.