Prashant Kishor: కరోనా వైరస్ లాంటి వ్యక్తిని వదిలించుకోవడం సంతోషంగా ఉంది: ప్రశాంత్ కిశోర్ పై నిప్పులు చెరిగిన జేడీయూ
- పార్టీలో కొనసాగే నైతిక అర్హత పీకేకు లేదు
- ఇలాంటి వ్యక్తిని ఎవరూ నమ్మలేరు
- ఇప్పుడు ఆయనకు ఇష్టం ఉన్న చోటుకు వెళ్లొచ్చు
జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ మాట్లాడుతూ ప్రశాంత్ కిశోర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరిన వెంటనే ప్రశాంత్ కిశోర్ కు నితీశ్ కుమార్ ఉపాధ్యక్ష బాధ్యతలను అప్పగించి గౌరవించారని... అయితే, పార్టీలో కొనసాగే నైతిక అర్హత కూడా ఆయనకు లేదని అన్నారు.
ప్రధాని మోదీ, నితీశ్ కుమార్ ల నమ్మకాన్ని ఆయన గెలుచుకోలేకపోయారని చెప్పారు. ఆయన కేజ్రీవాల్ పార్టీ కోసం పని చేస్తారని, రాహుల్ గాంధీతో మాట్లాడతారని, మమత బెనర్జీతో కూర్చుంటారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. కరోనా వైరస్ వంటి ఇలాంటి వ్యక్తిని వదిలించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పుడు ఆయనకు నచ్చిన చోటుకు వెళ్లవచ్చని ఎద్దేవా చేశారు.