BJP: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దు: ఇద్దరు బీజేపీ నేతలపై ఈసీ నిషేధం
- ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్, వర్మ
- కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్
- బీజేపీ తమ స్టార్ క్యాంపెయినర్‌ల జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు
ఇటీవల ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ర్యాలీల్లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వారిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ ఇద్దరు నేతలనూ బీజేపీ వెంటనే తమ స్టార్ క్యాంపెయినర్‌ల జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
తమ నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వారిద్దరు ఢిల్లీ ఎన్నిక ప్రచారంలో పాల్గొనవద్దని ఆదేశించింది. కాగా, రితాలాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... సీఏఏపై ఆందోళనలు చేస్తోన్న వారిని దేశద్రోహులు అని అన్నారు. ఇటువంటి వారిని కాల్చిపారేయాలన్నారు. ఎంపీ పర్వేశ్ వర్మ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ... షహీన్ బాగ్ లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు ఇళ్లల్లోకి చొరబడి హత్యలు, అత్యాచారాలు చేస్తారని ఆరోపించారు.