Happy PhD: ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ నేత హర్మీత్ హతం?
- 20 ఏళ్లుగా పాక్ లో ఆశ్రయం
- స్థానిక ముఠాల చేతుల్లో హర్మీత్ హతమయ్యాడని వార్త
- పంజాబ్ లో అర్ఎస్సెస్ నేతల హత్యలలో హస్తం
ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేసిన నిషేధిత ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ (కేఎల్ఎఫ్) తీవ్రవాద సంస్థకు చెందిన హర్మీత్ సింగ్ అలియాస్ ‘హ్యాపీ పీహెచ్ డీ’ హతమయ్యాడని తెలుస్తోంది. హర్మీత్ ను పాకిస్థాన్ లోని ముఠాలు చంపివేసినట్లు ఓ నేషనల్ డైలీ ప్రచురించింది. గత 20 ఏళ్లుగా హర్మీత్ పాకిస్థాన్ లోని లాహోర్ సమీపంలోని డేరా చహల్ గురుద్వారాలో తలదాచుకుంటున్నాడని ఆ పత్రిక వెల్లడించింది. అక్కడ స్మగ్లింగ్, డ్రగ్ సరఫరా వంటి నేరాలు చేశాడని సమాచారం. ఈ నేపథ్యంలో ముఠాల మధ్య జరిగిన ఘర్షణల్లో హర్మీత్ హతమైనట్లు తెలుస్తోంది.
పంజాబ్ లోని చెహర్తాకు చెందిన హర్మీత్ సింగ్ పీహెచ్ డీ విద్య నభ్యసించాడు. ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ లో హర్మీత్ కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ లో గతంలో జరిగిన అర్ఎస్సెస్ నాయకుల హత్యలలో కీలకంగా వ్యవహరించాడని, అలాగే రెండేళ్ల క్రితం నిరంకారి భవన్ పై జరిగిన దాడిలో హర్మీత్ పాత్ర ఉందని తేలింది. ఆయుధాల సరఫరా, తదితర కేసులు కూడా ఇతనిపై పోలీసులు నమోదు చేశారు.