Child Pornography: ఐదు నెలల్లో 25 వేల చైల్డ్ పోర్న్ వీడియోలు అప్ లోడ్.. దేశ వ్యాప్తంగా ఎఫ్ఐఆర్ లు, అరెస్టులు!
- ఇండియాను అలర్ట్ చేసిన అమెరికా
- తొలి స్థానంలో ఢిల్లీ
- 1,700 కేసులను సైబర్ క్రైమ్ కు ఫార్వర్డ్ చేసిన మహారాష్ట్ర
అశ్లీల వీడియోలను వీక్షించడం, పోర్న్ సమాచారాన్ని చదవడం భారత్ లో ఆందోళనకర స్థాయికి చేరుతోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో పోర్న్ మెటీరియల్ ను అప్ లోడ్ చేయడం కూడా భారీగా పెరిగింది.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వాన్ని అమెరికా అలర్ట్ చేసింది. గత 5 నెలల కాలంలో చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన 25 వేల వీడియోలు, సమాచారాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని హెచ్చరించింది. ఈ మేరకు మన దేశానికి చెందిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్ విభాగం సమాచారాన్ని అందించింది.
ఈ సందర్భంగా భారత విదేశాంగశాఖ స్పందిస్తూ, ఈ విషయంలో ఢిల్లీ అగ్రభాగంలో ఉందని తెలిపింది. చైల్డ్ పోర్నోగ్రఫీ ఢిల్లీ నుంచే ఎక్కువగా అప్ లోడ్ అవుతోందని వెల్లడించింది. ఈ విషయంలో అగ్రస్థానంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఉన్నాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా పలు ఎఫ్ఐఆర్ లను నమోదు చేశామని, అరెస్టులు కూడా కొనసాగుతున్నాయని చెప్పింది.
ఈ నేపథ్యంలో, మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ, 1,700 కేసులను సైబర్ క్రైమ్ యూనిట్ కు ఫార్వర్డ్ చేశామని తెలిపారు.