AP Legislative Council: ఆనందంగా పదవులు వదిలేసుకుంటాం: ఏపీ మంత్రులు పిల్లి సుభాష్, మోపిదేవి!
![](https://imgd.ap7am.com/thumbnail/tn-4906c43194d8.jpg)
- శాసన మండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయం
- స్వాగతిస్తున్నామన్న వైసీపీ మండలి సభ్యులు
- విస్తృత ప్రయోజనాల కోసమే నిర్ణయమన్న పిల్లి
అభివృద్ధిని అడ్డుకుంటూ, రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయిన శాసనమండలిని రద్దు చేయాలన్న తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని, రాష్ట్ర భవిష్యత్ కోసం తమ మంత్రి పదవులను వదిలేసుకునేందుకు సిద్ధమేనని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన వారిద్దరూ, మండలిలో సభ్యులుగా ఉండటం ఆవేదనను కలిగిస్తోందని తెలిపారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-42e669c6b0516262e3e1f911c6e70a5bc6dedbf7.jpg)
మండలిలో సభ్యులుగా ఉన్న తాము పదవులను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. పెద్దల పేరు చెప్పుకుని అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే ఇటువంటి సభ ఉండటానికి వీల్లేదని, జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. చంద్రబాబు చేస్తున్న పనుల వల్ల చట్ట సభల్లోని సభ్యులు ప్రజల ముందు తల దించుకుని నిలబడాల్సి వస్తోందని దుయ్యబట్టిన ఆయన, తమ పార్టీ నుంచి గుర్తింపు పొందిన వ్యక్తులు మండలిలో ఉండగా, చంద్రబాబు మాత్రం దోపిడీదారులను మండలికి పంపారని విమర్శించారు.