Omar abdullah: ఒమర్ అబ్దుల్లాను అలా చూడడం కష్టంగా ఉంది: డీఎంకే చీఫ్ స్టాలిన్
- గుబురు గడ్డం, మీసంతో గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఒమర్
- అలా చూడలేకపోతున్నానన్న స్టాలిన్
- మిగతా వారి పరిస్థితి ఇంకెలా ఉందోనని ఆందోళన
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత కశ్మీర్ నేతలను గృహనిర్బంధంలోకి తీసుకున్న సంగతి విదితమే. అలా తీసుకున్న వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. దాదాపు ఐదు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న ఆయన ఫొటో ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎప్పుడూ స్మార్ట్‌గా కనిపించే ఒమర్ ఆ ఫొటోలో గుబురు గడ్డం, మీసాలతో గుర్తుపట్టలేనంతగా ఉన్నారు. రాజకీయ ప్రముఖులు ఎవరూ ఆ ఫొటోలో ఉన్నది ఒమర్ అంటే నమ్మలేకపోయారు.
ఒమర్‌ను తాను గుర్తుపట్టలేకపోయానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ట్వీట్ చేశారు. తాజాగా, డీఎంకే చీఫ్ స్టాలిన్ ఈ ఫొటోపై స్పందించారు. ఒమర్‌ను అలా చూడడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితర నేతల పరిస్థితి ఇంకెలా ఉందోనని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. వారందరినీ విడుదల చేయాలని కోరారు.