KVP: కేవీపీ ఓటు విషయంలో ఎన్నికల సంఘం సీరియస్... సూర్యాపేట కలెక్టర్ పై వేటు!
- కేవీపీకి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు
- తొలుత అంగీకరించి, ఆపై నిరాకరించిన కలెక్టర్
- కలెక్టర్ పై చర్యలకు ఈసీ సిఫార్సు
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కేవీపీ రామచంద్రరావు ఎక్స్ అఫీషియో ఓటు వ్యవహారంలో నెలకొన్న వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అమేయ కుమార్ పై బదిలీ వేటు వేసింది. ఆయన్ను రంగారెడ్డికి బదిలీ చేస్తూ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కు సూర్యాపేట జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
కాగా, నిన్న నేరేడుచర్ల ఎన్నికలు తీవ్ర గందరగోళానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు కేవీపీకి తొలుత అవకాశం కల్పించి, ఆపై నిరాకరించగా, అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఆందోళన కూడా చేసింది. ఆపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసిన ఈసీ, కేవీపీకి ఓటు వేసే అవకాశం కల్పిస్తూ, కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
ఈ నేపథ్యంలోనే అమేయ కుమార్ పై బదిలీ వేటు పడింది. ఇక, నిన్న వాయిదా పడిన నేరేడుచర్ల మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేడు జరుగనుంది.