Telugudesam MLCs: మండలి రద్దు తీర్మానంతో వైసీపీ ప్రభుత్వం రద్దుకు పునాది పడింది: టీడీపీ ఎమ్మెల్సీలు
- ప్రలోభాలకు లొంగలేదని రద్దుకు తీర్మానం చేశారు
- వైసీపీ ప్రతిపక్షాలను బ్లాక్ మెయిల్ చేస్తోంది
- మండలి రద్దు సుదీర్ఘ ప్రక్రియ.. ఇప్పట్లో రద్దు అసాధ్యం
శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని టీడీపీ ఎమ్మెల్సీలు తీవ్ర స్థాయిలో నిరసించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ...మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన సభను రద్దు చేస్తారా? అంటూ సీఎం జగన్ ను విమర్శించారు. ఈ తీర్మానంతో వైసీపీ ప్రభుత్వం రద్దుకు పునాది పడిందని టీడీపీ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. అయితే, మండలి రద్దు జరగడం అసాధ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుదన్నారు.
ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ.. న్యాయవాదిగా హైకోర్టు, సుప్రీంకోర్టులో పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నానని, శాసన మండలి రద్దు కాదు అని చెప్పారు. తీర్మానం జరిగిందని, అది ప్రాధాన్యత వారీగా పార్లమెంటులో టేబుల్ పైకి వెళుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో తీర్మానం అంత తొందరగా అమల్లోకి రాదని చెప్పారు.
మండలి రద్దుతో వైసీపీ ప్రభుత్వం రద్దు అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఎమ్మెల్సీ తిప్పేస్వామి అన్నారు. రద్దు తీర్మానానికి తాము భయపడమన్నారు. వైసీపీ తీర్మానం ద్వారా ప్రతిపక్షాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చెప్పారు. శాసన మండలి గత ఎనిమిది నెలల్లో 38 బిల్లులను పాస్ చేసిందని ఎమ్మెల్సీ వెంకట సత్యనారాయణ రాజు అన్నారు. రెండు బిల్లులు మాత్రమే సెలెక్ట్ కమిటీకి పంపితే మండలిని రద్దు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రలోభాలకు లొంగలేదని తీర్మానం చేశారని పేర్కొన్నారు. మండలిని చులకనచేసి మాట్లాడుతున్న సీఎంకు రానున్న రోజుల్లో ఎగువ సభ శక్తిని పూర్తిస్థాయిలో రుచిచూపిస్తామని ఎమ్మెల్సీలన్నారు. తమకు ఫోన్లు చేసి ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారని వారు ఆరోపించారు. శాసన మండలనేది లేకుంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే స్తోమత లేని కులాల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు.