Jagan: నాడు ఎన్టీఆర్ మండలిని రద్దు చేసినప్పుడు 'ఈనాడు'లో ఏం రాశారో క్లిప్పింగ్స్ వేసిన సీఎం జగన్
- అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్
- టీడీపీ సభ్యులపై తీవ్ర విమర్శలు
- రాజకీయ ప్రయోజనాలతో అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వ్యాఖ్యలు
- ఈనాడుపైనా విసుర్లు
- 1983 నాటి ఈనాడు ఎడిటోరియల్ ను చదివి వినిపించిన సీఎం
ఏపీ సీఎం జగన్ మండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలి అనవసరమని, రాజకీయ ప్రయోజనాలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని టీడీపీ సభ్యులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు అందిస్తామంటే అందుకూ అడ్డుకుంటారు, ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేస్తే ఆ బిల్లులకు కూడా అడ్డుతగులుతున్నారు, ప్రతి ప్రాంతానికి కూడా అభివృద్ధి సమంగా అందాలని భావించి వికేంద్రీకరణ బిల్లు పెడితే దాన్ని సైతం రాజకీయ కోణంతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేయకుండా, ఆ బిల్లులను ఎలా అడ్డుకోవాలి, ఎలా కత్తిరించాలి అని ఆలోచించే దిక్కుమాలిన మండలి అవసరమా? అని ప్రశ్నిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా 1983లో ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసిన సమయంలో 'ఈనాడు' దినపత్రిక ఎడిటోరియల్ లో ఏమని పేర్కొన్నారో సీఎం జగన్ క్లిప్పింగ్స్ వేసి మరీ ప్రదర్శించారు. 'ఈనాడు'ను ఓ పార్టీకి పాంప్లెట్ పేపర్ అంటూ విమర్శించారు. ప్రజలు అఖండ విజయం అందించిన ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాలను అంగీకరించకుండా అడ్డుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది అంటూ నాడు 'ఈనాడు' పేపర్ మండలికి వ్యతిరేకంగా పేర్కొన్న అంశాన్ని సీఎం జగన్ సభలో చదివి వినిపించారు. మండలి వద్దేవద్దంటూ ఎంత చక్కగా రాశారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అంతేకాదు, ఇది 'సాక్షి' కాదు అధ్యక్షా ఇది 'ఈనాడు' అంటూ సెటైర్ వేశారు.
"కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు రాజకీయ కోణంలో అడ్డుతగులుతున్న ఈ మండలిని అనవసర ఆర్థిక భారం దృష్ట్యా రద్దు చేస్తున్నాం అని చెప్పడానికి గర్వపడుతున్నాం. మండలిని ఇప్పుడున్న విధంగా కొనసాగిస్తే వచ్చే ఏడాదికి మా పార్టీ వాళ్లకు ఇందులో కూడా మెజారిటీ వస్తుందని తెలుసు. కానీ ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం. పార్టీ అవసరాల కంటే ప్రజల అవసరాలే మాకు ప్రధానం" అంటూ ఉద్ఘాటించారు.