Pilli Subhas Chandra Bose: విస్తృత ప్రయోజనాలకోసం మండలి రద్దు తీర్మానం జరిగింది: మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
- ఎన్టీఆర్ హయాంలో స్వల్ప ప్రయోజనంకోసం రద్దు చేశారు
- శివరామకృష్ణన్ కమిటీ సూచనలను టీడీపీ విస్మరించింది
- రాజకీయాలకు మండలి కేంద్ర బిందువు అయింది
శాసన మండలి రద్దు తీర్మానాన్ని మంత్రి పిల్లి సుబాష్ చంద్రబోస్ సమర్థించారు. పాలన విభాగాలను మూడు రాజధానులుగా విభజిస్తూ చేసిన వికేంద్రీకరణ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించి మండలికి పంపితే.. అక్కడ ఆమోదం పొందకపోవడం విచారకరమన్నారు. ఎన్టీఆర్ హయాంలో శాసనమండలిని రద్దు చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావిస్తూ.. అప్పుడు స్వల్పకాల ప్రయోజనం ఆశించి రద్దు చేశారన్నారు.
ప్రస్తుతం సీఎం జగన్ విస్తృత ప్రయోజనం ఆశించి ఈ మండలి రద్దును ప్రతిపాదించారన్నారు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలను మంత్రి ప్రస్తావించారు. మంచి స్థలాన్ని ఎంపిక చేయడమే లక్ష్యంగా ఆ కమిటీ మూడు సూచనలు చేసిందన్నారు. డిస్ ప్లేస్ మెంట్(స్థానిక ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించడం) తక్కువగా ఉండాలని, వ్యవసాయ భూమికి అతి తక్కువ నష్టం జరగాలని, తక్కువ వ్యయంతో రాజధాని నిర్మాణం కావాలని చెప్పిందన్నారు. ఈ సిఫారసులకు భిన్నంగా అమరావతిలో జరిగిందన్నారు. శాసన మండలిని రాజకీయ కేంద్రంగా మార్చారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఈ తీరును ప్రజలు ఆమోదించటం లేదన్నారు.