Nara Lokesh: హాజరు మినహాయింపు దక్కలేదని కోర్టును కూడా రద్దు చేస్తారా ఏంటి?: సీఎం జగన్ పై లోకేశ్ వ్యంగ్యం
- సీఎం జగన్ పై లోకేశ్ వ్యాఖ్యలు
- తీవ్ర ఆర్థిక నేరగాడు అంటూ విమర్శలు
- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారంటూ మండిపాటు
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో జగన్ పై లోకేశ్ ట్వీట్ చేశారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు దక్కలేదని పేర్కొన్నారు. "వ్యక్తిగత హాజరు మినహాయింపు దక్కలేదని కోర్టులను రద్దు చేస్తారా? లేకపోతే, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని ఏకంగా శుక్రవారాన్ని తీసేసి వారానికి ఆరు రోజులే అని జీవో తెస్తారా?" అంటూ సెటైర్ వేశారు. ఈ సందర్భంగా మండలి రద్దు నిర్ణయాన్ని లోకేశ్ తప్పుబట్టారు.
కొన్ని బిల్లులు ప్రజాభిప్రాయం కోసం సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లడం సాధారణమైన విషయమని, బిల్లులు ప్రజాభిప్రాయానికి వెళితే జగన్ ఎందుకు వణికిపోతున్నాడని ప్రశ్నించారు. మండలిని రద్దు చేసి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నది ప్రజలు కోరుకున్నది కాదని, తన స్వార్థ నిర్ణయం అని జగన్ స్వయంగా ఒప్పుకున్నాడని లోకేశ్ ఆరోపించారు. "తుగ్లక్ నిర్ణయాలకు అడ్డువస్తే శాసన వ్యవస్థలను కూడా శాసిస్తామని జగన్ అంటున్నారు. మండలిని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు" అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.