China: చైనాలో 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం... పని ప్రారంభించిన వందలాది జేసీబీలు!
- రోగులందరికీ ఒకే చోట చికిత్స
- శ్రామిక శక్తి అపారంగా ఉన్న చైనా
- శరవేగంగా భారీ ఆసుపత్రి నిర్మాణం
మహమ్మారిగా మారి దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు ఓ వైపున ప్రయత్నిస్తూనే, పెరుగుతున్న రోగులను ఒకే చోట ఉంచి చికిత్సను అందించే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రామిక శక్తి అపారంగా ఉన్న చైనా, కేవలం పది రోజుల్లో 1000 పడకల సామర్థ్యమున్న భారీ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు జీ జిన్ పింగ్ స్వయంగా వెల్లడించారు.
ఇప్పటికే వందలాది జేసీబీలు పునాదుల పని ప్రారంభించాయి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఈ భవంతి నిర్మాణం సాగనుండగా, పనులు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇదిలావుండగా, చైనాలో ప్రజలు ఈ వైరస్ పేరు చెబితేనే తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. వీధుల్లోకి రావాలంటే మాస్క్ లేకుండా ఎవరూ రావడం లేదు. ఎన్నో ఆసుపత్రుల బయట టెంట్లు వేసి వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందిస్తున్నారు. కరోనా బారిన పడి ఇప్పటివరకూ 50 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.