Jupalli: జూపల్లి ఇకనైనా టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చి తన ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలి: పొన్నం ప్రభాకర్
- కొల్లాపూర్ లో రెబెల్స్ కు మద్దతు పలికిన జూపల్లి
- జూపల్లిపై టీఆర్ఎస్ ఆగ్రహం
- జూపల్లిని అవమానించడం సరికాదన్న పొన్నం
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొల్లాపూర్ లో చోటుచేసుకున్న పరిణామాలతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై టీఆర్ఎస్ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. అక్కడి రెబెల్స్ కు ఆయన మద్దతివ్వడమే అందుకు కారణం. ఎన్నికల్లో 20 స్థానాలకు గాను 9 స్థానాల్లో టీఆర్ఎస్, 11 స్థానాల్లో జూపల్లి మద్దతు ఇచ్చిన రెబెల్ అభ్యర్థులు గెలిచారు. మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం కోసం 12 స్థానాలు అవసరం కాగా, తాము మద్దతిస్తామని జూపల్లి చెప్పినా టీఆర్ఎస్ హైకమాండ్ ససేమిరా అని చెప్పింది. జూపల్లి వర్గీయులు మళ్లీ టీఆర్ఎస్ లో చేరేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. దాంతో జూపల్లి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు.
మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకున్న జూపల్లిని టీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారని, ఇది సరైన పంథా కాదని అన్నారు. నాడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మంత్రి పదవిని వద్దనుకుని టీఆర్ఎస్ లో చేరారని, తెలంగాణ కోసం ఉద్యమించారని తెలిపారు. జూపల్లి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే సమయం వచ్చిందని, ఇప్పటికైనా ఆయన టీఆర్ఎస్ ను వీడాలని, తద్వారా తన ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలని పొన్నం సూచించారు.