Virat Kohli: ఆక్లాండ్ మైదానంలో వరుసగా రెండో విజయంపై కోహ్లీ వ్యాఖ్యలు

  • రెండో టి20లో టీమిండియా గెలుపు
  • బౌలర్ల కారణంగానే నెగ్గామన్న కోహ్లీ
  • కోహ్లీ అభిప్రాయంతో ఏకీభవించిన కివీస్ కెప్టెన్

విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో వరుసగా రెండో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆక్లాండ్ లో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ, మొదట బంతితో రాణించడం వల్లే మ్యాచ్ లో విజయం నల్లేరుపై నడకలా సాగిందని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ పిచ్ పై తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని కితాబిచ్చాడు.

జడేజా అమోఘంగా బౌల్ చేశాడని, చాహల్ ఆధారపడదగ్గ ఆటగాడని మరోసారి నిరూపించుకున్నాడని కొనియాడాడు. బుమ్రా, షమీ, శార్దూల్, శివమ్ దూబే బంతితో తమవంతు పాత్ర నిర్వర్తించారని, న్యూజిలాండ్ జట్టును వారి సొంతగడ్డపై 132 పరుగులకు పరిమితం చేయడం మామూలు విషయం కాదని అన్నాడు. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్  మైదానం గుండ్రంగా ఉండదని, కోణాలు తిరిగి ఉండే ఇలాంటి మైదానంలో ఫీల్డర్లను మోహరించడం కష్టమని, ఈ విషయంలో తాము ఎంతో అవగాహన పెంచుకున్నామని వివరించాడు.

ఇక, ఓటమిపాలైన న్యూజిలాండ్ జట్టు సారథి కేన్ విలియమ్సన్ స్పందిస్తూ, తొలి మ్యాచ్ తో పోలిస్తే ఈ మ్యాచ్ లో పిచ్ కాస్త భిన్నంగా తయారైందని అన్నాడు. తాము ఈ మ్యాచ్ లో మరో 20 పరుగుల వరకు చేస్తే పోరాడేందుకు అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల ప్రదర్శనే తమ ఓటమికి కారణమైందని తెలిపాడు. టీమిండియా అన్ని రంగాల్లో నాణ్యమైన జట్టు అని కొనియాడాడు.

Virat Kohli
Auckland
T20
Team New Zealand
Team India
Cricket
  • Loading...

More Telugu News