India: ఆయుధ సంపత్తిని ఘనంగా ప్రదర్శించిన భారత్

  • ఢిల్లీలో 71వ రిపబ్లిక్ డే వేడుకలు
  • హాజరైన రాష్ట్రపతి, ప్రధాని
  • యుద్ధ విమానాలు, పోరాట హెలికాప్టర్ల ప్రదర్శన

దేశ రాజధాని ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరైన ఈ వేడుకల్లో ప్రధానంగా భారత ఆయుధ సంపత్తి అందరి దృష్టిని ఆకర్షించింది. అనేక శత్రుభీకర అస్త్రాలను భారత్ ఈ వేడుకల్లో ప్రదర్శించింది. దేశీయంగా తయారైన ధనుష్ ఫీల్డ్ గన్స్ అతిథులను ఆకట్టుకున్నాయి. ప్రపంచంలో అత్యంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తాయని ధనుష్ శతఘ్నులకు పేరుంది.

గగనతలంలోనూ భారత వాయుసేన తన అస్త్రాలను ప్రదర్శించింది. ఎంతో శక్తిమంతమైన చినూక్ హెలికాప్టర్లు దద్దరిల్లిపోయే శబ్దంతో పయనించాయి. రెండు రోటార్లు ఉండే ఈ హెలికాప్టర్ భారీగా సైనికులను, వాహనాలను, ఇతర ఆయుధాలను తరలించాల్సి వచ్చినప్పుడు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న అపాచీ హెలికాప్టర్లు కూడా ప్రధానాకర్షణగా నిలిచాయి. భూమిపై పయనించే యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేయడంలో అపాచీ హెలికాప్టర్ల సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీంట్లో ఇద్దరు మాత్రమే సిబ్బంది ఉంటారు. దీంట్లో అనేక ఆయుధాలు అమర్చి ఉంటాయి. శత్రుదేశాల పదాతి దళాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు అపాచీ హెలికాప్టర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.

ముఖ్యంగా, అంతరిక్ష యుద్ధం వస్తే శత్రు ఉపగ్రహాలను సైతం కుప్పకూల్చే అత్యాధునిక యాంటీ శాట్ క్షిపణిని ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించారు. ప్రత్యర్థి దేశం ఓ క్షిపణిని ప్రయోగించినప్పుడు ఆ క్షిపణికి దిశానిర్దేశం చేసే ఉపగ్రహాన్ని కూల్చివేయడం యాంటీ శాట్ క్షిపణి ప్రత్యేకత. దిశానిర్దేశం చేసే ఉపగ్రహం లేకుండా శత్రుదేశ క్షిపణి ఎలాంటి నష్టం కలుగజేయలేదు. ఇవేకాకుండా, మిగ్ 29, సుఖోయ్ యుద్ధ విమనాలు, గ్లోబ్, డోర్నియర్ వంటి సైనిక విమానాలు కూడా పరేడ్ లో కనువిందు చేశాయి.

India
Republic Day
Wepons
Apache
Chinook
Dhanush
  • Error fetching data: Network response was not ok

More Telugu News