KCR: ఉద్యోగుల వయోపరిమితి పెంచడంపై సీఎం కేసీఆర్ సానుకూల వ్యాఖ్యలు
- త్వరలోనే నిర్ణయం ఉంటుందన్న కేసీఆర్
- తప్పకుండా పెంచుతామని వెల్లడి
- పీఆర్సీ నివేదిక తెప్పించి కొద్దిమేర జీతాలు కూడా పెంచుతామని హామీ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అత్యంత ఘనవిజయం సాధించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉద్యోగుల వయోపరిమితి అంశంపై సానుకూల ధోరణి ప్రదర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని తప్పకుండా పెంచుతామని వెల్లడించారు. త్వరలోనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. పీఆర్సీ నివేదికను కూడా తీసుకుని వారి వయోపరిమితి పెంచే హామీ నెరవేర్చుతామని పేర్కొన్నారు. పీఆర్సీ నివేదిక అంటే జీతాలు పెంచుతారేమోనని ఉద్యోగులు భావించడం సహజమేనని, కానీ తమ ప్రభుత్వం మైనస్ లో నడుస్తోందని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడంలేదని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి భయానకంగా ఉందని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.5 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిమితులను బట్టి తృణమో పణమో జీతం పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక, 57 ఏళ్లు దాటిన వాళ్లకు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామన్న హామీని కూడా మార్చి నుంచి అమల్లోకి తెస్తామని చెప్పారు.