International: మంచు కళాఖండాలు చెక్కే పోటీల్లో భారత్!
- కొలరాడోలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ స్నో ఛాంపియన్ షిప్
- బరిలో మొత్తం 12 జట్లు
- ఐదు తలలున్న సర్పం శిల్పాన్ని రూపొందిస్తున్న భారత బృందం
మంచు శిలలతో కళా ఖండాలు చెక్కే పోటీలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. మంచుతో రూపుదిద్దుకున్న అద్భుతమైన కళాఖండాలు సందర్శకులను తన్మయత్వంలో ముంచుతున్నాయి. ఈ నెల 20న అమెరికాలోని కొలరాడోలో ప్రారంభమైన పోటీల్లో మొత్తం 12 జట్లు పాలుపంచుకుంటున్నాయి. 30వ ఇంటర్నేషనల్ స్నో స్క్లప్చర్ ఛాంపియన్ షిప్ -2020 పేర నిర్వహిస్తోన్న ఈ పోటీల్లో భారత్ కూడా పాలుపంచుకుంటోంది.భారత బృందం ఐదు తలలున్న సర్పం శిల్పాన్ని చెక్కుతోంంది. మంగోలియాకు చెందిన సభ్యులు 20 టన్నులతో స్మార్ట్ ఫోన్ పట్టుకున్న కళాఖండాన్ని చెక్కారు. ఫ్రాన్స్ కు చెందిన కళాకారులు టోర్నడో దృశ్యాన్ని చెక్కారు. కాగా టర్కీ బృందం మంచు ముక్కలతో పజిల్ సర్కిల్ ను రూపొందించింది. చైనా బృందం జిన్హువా వాంగ్ విగ్రహాన్ని తయారు చేసింది. ఓ వైపు చలి తీవ్రంగా ఉన్నప్పటికీ.. సందర్శకులు చలితట్టుకునే దుస్తులు ధరించి మంచు కళాఖండాల పోటీలను తిలకించడానికి పోటెత్తుతున్నారు.