Crime News: అమ్మో...కి'లేడీ'లు.. కనికట్టుచేసి బంగారం కాజేస్తారు!

  • బంగారం షాపులే వీరి లక్ష్యం 
  • షాపులో నిర్వాహకుడు ఒక్కరే ఉంటే అంతే సంగతులు 
  • ఒక్కొక్కరుగా ముగ్గురూ ప్రవేశించి అందినకాడికి చోరీ

ఆ ముగ్గురు మహిళలు ఓ ముఠా. ఒంటరి నిర్వాహకుడు ఉన్న బంగారం షాపులే వారి లక్ష్యం. ఒంటి నిండా గిల్ట్ నగలు ధరించి ఒకరి తర్వాత ఒకరు దర్జాగా షాపులోకి ప్రవేశిస్తారు. అవీఇవీ అంటూ పలు వివరాలు అడుగుతారు. ఆభరణాలు ఒక్కసారి ధరించవచ్చా? అని అడుగుతారు. నిర్వాహకుడు 'ఎస్' అన్నాడా.. పనైపోయినట్టే. గిల్ట్ నగలు అప్పగించి అసలు నగలతో మాయం అవుతారు. ఇచ్చింది అసలు నగ కాదని నిర్వాహకుడు తెలుసుకునేలోగానే అక్కడి నుంచి కనిపించకుండా పోతారు. ఇలా పలు షాపుల్లో టోకరా ఇచ్చిన ఈ ముగ్గురినీ భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల కథనం మేరకు... కృష్ణా జిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లికి చెందిన మెచ్చర్ల రేణుక, బొజ్జగాని జ్ఞానమ్మ, బొజ్జగాని నాగమణి ముగ్గురూ ఓ ముఠా. బంగారం షాపుల్లో చోరీలకు పాల్పడుతుంటారు. ఈనెల 10న పాల్వంచ పట్టణం అంబికా రోడ్డులోని ఓ బంగారం దుకాణంలో 9 తులాల బంగారం చోరీ చేశారు.

నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ సాయంతో దొంగలను గుర్తించే ప్రయత్నం చేశారు. వారి రాకపోకలపై లభించిన ఆధారాలతో నిఘా పెట్టారు. ఈ క్రమంలో నిన్న పాల్వంచ పట్టణం నటరాజ్ జంక్షన్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.3.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News