YSRCP: బిల్లును కోల్డ్ స్టోరేజీలో పెట్టిస్తే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు: మంత్రి కన్నబాబు
- మండలిలో సంఖ్యా బలముందని బిల్లుని అడ్డుకుంటున్నారు
- నాలుగు రోజులు సమయం పట్టినా రాజధాని తరలింపు జరుగుతుంది
- మండలి ఛైర్మన్ అధికారాలపై చర్చ జరగాల్సిన అవసరముంది
శాసన మండలిలో టీడీపీకి సంఖ్యాబలం ఉందని రాజధాని బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. మోకాలు అడ్డుపెట్టినంత మాత్రాన రాజధాని తరలింపు ఆగదని చెప్పారు. ఈ రోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు రోజులు సమయం పట్టినా రాజధాని తరలింపు జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత టీడీపీ కుట్రలు చేసి ఎస్సీ, ఎస్టీ కమిషన్ లను వేరుపరిచే బిల్లు, ఆంగ్ల విద్య బిల్లు , సీఆర్డీఏ, అభివృద్ధి బిల్లును అడ్డుకుందన్నారు. బిల్లును కోల్డ్ స్టోరేజీలో పెట్టి, పక్కన పెట్టినంత మాత్రాన ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.
వికేంద్రీకరణను ప్రజలు కోరుకున్నారు కాబట్టే అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. మండలిలో బిల్లులు అడ్డుకోవడానికి ఛైర్మన్ కు ఉన్న విచక్షాణాధికారాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మండలి ఛైర్మన్ అధికారాలపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు రాజధాని తరలింపును అడ్డుకుంటున్నారన్నారు. విచక్షణాధికారం కౌన్సిల్ ఛైర్మన్ కున్నప్పుడు.. ఎక్కడి నుంచి పరిపాలించాలనే అధికారం సీఎంకు ఉండదా? అని ప్రశ్నించారు. ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ వ్యవస్థ మొత్తం ఉంటుందని మంత్రి చెప్పారు.