BJP: ఫోన్ ట్యాపింగ్‌లపై మహారాష్ట్రలో మాటల యుద్ధం.. విచారణకు ఆదేశం
- గత బీజేపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడేదని ఆరోపణలు
- విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర హోం మంత్రి
- విచారణ చేసుకోమని ఫడ్నవీస్ వ్యాఖ్య
మహారాష్ట్రలో గత బీజేపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడేదని, కాంగ్రెస్, ఎన్సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసేదని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్, ఎన్సీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసేది. వారి కార్యక్రమాల గురించి తెలుసుకునేది. ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను తెచ్చుకోవడానికి బీజేపీ కొందరు అధికారులను ఇజ్రాయెల్ పంపింది. ఈ విషయంపై మేము విచారణ ప్రారంభించాం' అని ప్రకటించారు.
దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. 'ఈ రోజుల్లో రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ సాధారణమైపోయింది. ఈ విషయాన్ని నేను సీరియస్‌గా తీసుకోను. ఫోన్లను ట్యాప్ చేసి ప్రతిపక్షాలపై కన్నేసి ఉంచడం కేంద్ర హోం శాఖకు అలవాటుగా మారిపోయింది. వారు ఇటువంటి నిఘాలు పెట్టినప్పటికీ మేము మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం' అని తెలిపారు. అంతకు ముందు కూడా ఇదే విషయంపై ఆయన స్పందిస్తూ... 'నా ఫోన్ ట్యాప్ చేశారని నాకు ఓ బీజేపీ సీనియర్ మంత్రి తెలిపారు' అని వ్యాఖ్యానించారు.
దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ... 'ఇలా ప్రతిపక్ష పార్టీల ఫోన్లను ట్యాప్ చేసే సంప్రదాయం మహారాష్ట్రలో లేదు. అటువంటి చర్యలకు పాల్పడాలని గత మా ప్రభుత్వం ఎన్నడూ ఆదేశించలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతో అయినా, ఎలాంటి విచారణయినా జరిపించుకోవచ్చు. అప్పట్లో శివసేన నేత కూడా రాష్ట్ర హోం శాఖలో పనిచేశారు కదా?' అని వ్యాఖ్యానించారు. దీనిపై త్వరగా విచారణ జరిపించి నిజాన్ని ప్రజల ముందు ఉంచాలని ఆయన అన్నారు.
ఈ విషయంపై కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే మాట్లాడుతూ.. 'శరద్ పవార్, సుప్రియా సూలె, సంజయ్ రౌత్ వంటి వారి ఫోన్లను ట్యాప్ చేసే అవసరం గత మహారాష్ట్ర ప్రభుత్వానికి లేదు' అని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.