Wild Elephant: ఏనుగు దాడిలో ఇద్దరి మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

  • పంటపొలాల్లోకి ప్రవేశించిన ఏనుగు
  • అడ్డుకున్న గ్రామస్థులు ..ఎదురు తిరిగిన గజరాజు  
  • పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న ఫారెస్ట్ సిబ్బంది 

పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగును వెళ్లగొట్టడానికి ప్రయత్నించిన వారిపై ఎదురు దాడి చేసిన ఆ గజరాజు ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ దాడిలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా రాష్ట్రం, జాజ్ పూర్ జిల్లాలోని గోడిపటానా గ్రామం సమీపంలో నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. సమీప అడవుల్లోంచి వచ్చిన ఏనుగు పంట పొలాలను ధ్వంసం చేస్తూండటంతో.. అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నించారన్నారు.

ఏనుగును కర్రలతో కొట్టడంతో అది వారిపై ఎదురు దాడి ప్రారంభించిందంటూ... పారిపోతున్న వారిని వెంబడించి మరీ ప్రాణాలను తీసిందన్నారు. గాయపడ్డవారిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారని తెలిపారు. గత ఆదివారం కూడా ఏనుగు బెనాపాటియా గ్రామంలో 55 ఏళ్ల గిరిజన వ్యక్తిని చంపివేసిందని అధికారులు చెబుతున్నారు.

ఆ మదగజం ఝార్ఖండ్ అడవుల్లోంచి ఇక్కడికి వచ్చిందని.. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు. ఈ ఘటనను స్థానికులు మొబైల్ లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 

Wild Elephant
Attack
Odisha
Jajpur
Two men Killed
  • Error fetching data: Network response was not ok

More Telugu News