Somireddy Chandra Mohan Reddy: అంబేద్కర్ గారేమైనా పొరపాటు చేశారేమో!: సీఎం జగన్ పై సోమిరెడ్డి వ్యాఖ్యలు
- రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదన్న జగన్!
- దీన్ని జగనే మొదటిసారి గుర్తించారంటూ సోమిరెడ్డి వ్యంగ్యం
- గత పాలకులెవ్వరూ గుర్తించలేకపోయారని సెటైర్
రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదని, పరిపాలన కోసం వికేంద్రీకరణ చేయొచ్చని సీఎం జగన్ చెప్పడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. "రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని వైఎస్ జగన్ చెబుతున్నారు. దీనిని మొదటిసారిగా సీఎం జగనే గుర్తించినట్టున్నారు. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాజధాని గురించి ప్రస్తావించకుండా పొరపాటు చేశారేమో! సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధానంట! ఆయన ఎటువెళితే అటు అధికారులంతా పెట్టేబేడా సర్దుకుని గుడారాలు వేసుకుంటే సరిపోతుంది" అంటూ సోమిరెడ్డి వ్యంగ్యంగా అన్నారు.
మొత్తానికి రాజధాని అంటే సరికొత్త నిర్వచనం చెబుతున్నారని, ఈ మాత్రం ఆలోచన 72 ఏళ్లుగా పరిపాలించిన వారికి కూడా లేకపోయింది అంటూ ఎద్దేవా చేశారు. జయలలిత ఊటీ నుంచి పరిపాలించారని చెబుతున్నారని, మన రాష్ట్రంలో కూడా హార్సిలీ హిల్స్, అరకు వంటి ప్రాంతాలున్నాయని, అక్కడి నుంచి పరిపాలన సాగించుకోవచ్చని ఎత్తిపొడిచారు.