Article 370: ఆర్టికల్ 370 రద్దుని అంగీకరించాల్సిందే.. మరోమార్గం లేదు: కేంద్రం స్పష్టీకరణ
- ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ
- అది ముగిసిన అధ్యాయమన్న అటార్నీ జనరల్
- తీర్పును రిజర్వులో ఉంచిన రాజ్యాంగ ధర్మాసనం
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిన్న విచారించింది. కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పిటిషన్‌దారుల వాదనలను గట్టిగా తిప్పికొట్టారు. ఆర్టికల్ 370 రద్దు అనేది ముగిసిన అధ్యాయమని, దానిని అంగీకరించడం మినహా ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాకపోయి ఉంటే ఆర్టికల్370 ఊసే ఉండేది కాదన్నారు. జమ్మూ, కశ్మీర్ విలీనపత్రంపై మహారాజా హరిసింగ్ సంతకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జమ్మూకశ్మీర్ సొంత రాజ్యాంగానికి చాలా కాలం ముందు నుంచే అక్కడ భారత రాజ్యాంగంలోని నిబంధనలు వర్తించేవని వేణుగోపాల్ తెలిపారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉందంటూ రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. కాబట్టి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు తావులేదని తేల్చి చెప్పారు. పిటిషన్‌దారులు కోరినట్టు ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి విచారణ బాధ్యతలు అప్పగించాల్సిన పనిలేదన్నారు. వాదనలు విన్న జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ విషయంలో సమగ్ర ఉత్తర్వు జారీ చేయనున్నట్టు పేర్కొంది.