Yanamala: సీఎం అయినంత మాత్రాన రాజధానిని మార్చే హక్కు జగన్ కు లేదు: యనమల రామకృష్ణుడు
- అమరావతిలో రాజధాని ఉండకూడదని జగన్ చూస్తున్నారు
- నిన్న మండలిలో వైసీపీ సభ్యులు, మంత్రుల తీరు దారుణం
- మండలి చైర్మన్ విచక్షణాధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు.
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ను ఎన్నుకున్నంత మాత్రాన రాజధానిని మార్చే హక్కు ఆయనకు లేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళగిరిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో రాజధాని ఉండకూడదని జగన్ చూస్తున్నారని, మయసభను చూశాక దుర్యోధనుడికి అసూయ కలిగినట్టుగా, అమరావతిని చూస్తే జగన్ కు కూడా అదే మాదిరి పరిస్థితి ఉందని విమర్శించారు. అమరావతిని చూస్తుంటే జగన్ కు చంద్రబాబే గుర్తుకొస్తున్నారని, దీనిని ఆయన భరించలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
నిన్న శాసనమండలిలో వైసీపీ సభ్యులు, మంత్రులు ఎలా ప్రవర్తించారో ఫొటోలు, దృశ్యాలు చూస్తే తెలుస్తుందని విమర్శించారు. రూల్ 154 ప్రకారం చైర్మన్ నిర్ణయం తీసుకుని సెలెక్ట్ కమిటీకి పంపారని, చైర్మన్ విచక్షణాధికారాన్ని ప్రశ్నించేందుకు వీళ్లెవరు? అని ప్రశ్నించారు. చైర్మన్ విచక్షణాధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని, సీఎం జగన్ కు రూల్స్ తెలియవని, ఆయనకు ఎవరూ చెప్పరని యనమల విమర్శించారు.
నిన్న మండలిలో 22 మంది మంత్రులు, వైసీపీ సభ్యులు తిష్టవేశారని, సభలో కార్యకలాపాలను ప్రభావితం చేయాలనుకున్నారని ఆరోపించారు. వీళ్లందరినీ బయటకు పంపాలని రూల్ ప్రకారం తాను కోరానని, మండలి, అసెంబ్లీ రెండు వేర్వేరు వ్యవస్థలని, వాటి అధికారాలు, బాధ్యతలు వేర్వేరుగా ఉంటాయని, రూల్ బుక్ చేస్తే ఇవన్నీ అర్థమవుతాయని ఆయన అన్నారు.