Air India: మంత్రి కాకపోతే.. ఎయిరిండియాను కొనడానికి బిడ్డింగ్ వేసే వాణ్ణి: కేంద్రమంత్రి పీయూష్ గోయల్
- అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా
- ప్రైవేటీకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న కేంద్రం
- ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన గోయల్
- స్ట్రాటెజిక్ అవుట్ లుక్: ఇండియా అంశంపై ప్రసంగం
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు-2020 కు హాజరైన కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిని కాకపోయి ఉంటే.. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా సంస్థను కొనుగోలు చేసేవాడినని వ్యాఖ్యానించారు. తీర్చలేని అప్పుల్లో ఉన్న ఎయిరిండియాను ప్రైవేటీకరించడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దావోస్ లో మంత్రి ‘స్ట్రాటెజిక్ అవుట్ లుక్: ఇండియా’ అన్న అంశంపై ప్రసంగిస్తూ.. ఎయిరిండియా, బీపీసీఎల్ తదితర ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలను ప్రస్తావించారు. ‘ఈ రోజు కేంద్రమంత్రిని కాకపోయి ఉంటే ఎయిరిండియా కొనుగోలుకు బిడ్డింగ్ వేసేవాడిని. సమర్థవంతమైన నిర్వహణతో సేవలు అందిస్తున్న ఎయిరిండియా నా దృష్టిలో బంగారు గని కంటే తక్కువేమీ కాదు. ఎయిరిండియా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆదరణ చూరగొంది’ అని గోయల్ అన్నారు.