Andhra Pradesh: కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు!: 'మూడు రాజధానులు, సీఆర్డీఏ'పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  • బిల్లు సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉందన్న అడ్వొకేట్ జనరల్
  • విచారణ పూర్తయ్యేలోపు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టవద్దన్న ధర్మాసనం 
  • హైకోర్టుకు వచ్చిన విజయసాయిరెడ్డి, కేశినేని

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలను సవాల్ చేస్తూ అమరావతి ప్రాంతానికి చెందిన 37మంది రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నిన్న విచారణ చేపట్టి, ఈ అంశాలపై శాసన మండలిలో చర్చ సాగుతోందని పేర్కొంటూ.. నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే, నేడు కాసేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత విచారణను ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేసింది.

ఇక ఈ పిటిషన్లకున్న ప్రాధాన్యత దృష్ట్యా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. నేటి విచారణలో భాగంగా బిల్లు ప్రస్తుతం ఏ స్థితిలో ఉందని ప్రధాన న్యాయమూర్తి అడ్వకోట్ జనరల్ ను అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది మండలికి వెళ్లిందని.. అక్కడ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించారని తెలిపారు.  

ఈ నేపథ్యంలో ప్రస్తుతం విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే, పిటిషనర్ల తరపు న్యాయవాది కలుగజేసుకుని, విచారణ జరగకపోతే.. ప్రధాన కార్యాలయాలను తరలిస్తారని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. విచారణ పూర్తయ్యేలోపు కార్యాలయాలు తరలిస్తే కనుక అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

అనంతరం విచారణను కోర్టు ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈ కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఈ రోజు విచారణను ప్రత్యక్షంగా చూడడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని కోర్టుకు వచ్చారు.

Andhra Pradesh
High Court
Three capitals
CRDA Bill
Cases
  • Loading...

More Telugu News