Raj Thackeray: థాకరేల కుటుంబం నుంచి మరో నాయకుడు.. రూపు మార్చుకున్న ఎంఎన్ఎస్ జెండా

  • రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ థాకరే కుమారుడు అమిత్ థాకరే
  • బాల్ థాకరే జయంతి సందర్భంగా ఎంఎన్ఎస్ మహా సభ
  • పూర్తిగా కాషాయం రంగులోకి మారిన ఎంఎన్ఎస్ జెండా

మహారాష్ట్ర రాజకీయాల్లో థాకరేలు దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాకరే ఉన్నప్పుడే ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే, సోదరుడి కుమారుడు రాజ్ థాకరేలు రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరించారు. ఆ తర్వాత ఉద్ధవ్ థాకరే శివసేన పగ్గాలను చేపట్టగా... మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పేరుతో రాజ్ థాకరే సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా థాకరేల చరిత్రలో తొలిసారిగా ఉద్ధవ్ థాకరే రాజకీయ పదవిని చేపట్టారు. ఏకంగా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు ఆదిత్య థాకరేని కూడా ఉద్ధవ్ బరిలోకి దించారు. ఎన్నికల్లో గెలుపొందిన ఆదిత్యకు మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు.

తాజాగా థాకరేల కుటుంబం నుంచి మరో వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన మరెవరో కాదు. రాజ్ థాకరే కుమారుడు అమిత్ థాకరే. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే జయంతిని పురస్కరించుకుని నేడు ఎంఎన్ఎస్ పార్టీ మహా సభను నిర్వహించింది.

 ఈ సందర్భంగా అమిత్ థాకరేను అధికారికంగా పార్టీలోకి తీసుకున్నారు. 2006లో ఎంఎన్ఎస్ ను రాజ్ థాకరే స్థాపించారు. ఆ తర్వాత దాదాపు 14 ఏళ్ల అనంతం పార్టీ మహాసభను నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కొత్త జెండాను కూడా ఆవిష్కరించారు. ఇప్పటి వరకు కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న జెండా... ఇప్పుడు పూర్తిగా కాషాయ రంగులోకి మారింది. జెండా మధ్యలో శివాజీ కాలంనాటి శివాజీ రాజముద్రను ఉంచారు.
ఎంఎన్ఎస్ కొత్త జెండా

  • Loading...

More Telugu News