nirbhaya case: చివరి కోరిక అడిగితే 'మౌనం' దాల్చిన నిర్భయ దోషులు
- ఒకటిన ఉరితీయాలని కోర్టు డెత్ వారెంట్
- చివరి కోరిక తీర్చడం రాజ్యాంగం కల్పించిన హక్కు
- అదే విషయాన్ని ప్రస్తావిస్తున్న జైలు అధికారులు
ఉరి శిక్షకు ముందు మీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పాలని జైలు అధికారులు పదేపదే ప్రశ్నిస్తున్నా నిర్భయ దోషులు నోరు విప్పడం లేదు. తమ ఆఖరి కోరిక చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీంతో తమ ఉరి మళ్లీ వాయిదా పడుతుందన్న ధీమా వారిలో ఉన్నట్లుందని జైలు అధికారులు భావిస్తున్నారు. దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులను ఫిబ్రవరి ఒకటిన ఉరితీయాలని కోర్టు డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. శిక్ష అమలు చేసే ముందు దోషుల ఆఖరి కోరిక తీర్చడం రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు. కుటుంబ సభ్యులను కలవాలనో, తమ ఆస్తులు ఎవరికైనా రాసివ్వాలనో, మంచి భోజనం...ఇలా చట్టపరమైన పరిధిలో ఉన్న కోరికైతే తీర్చేందుకు జైలు అధికారులు ప్రయత్నిస్తారు.
కానీ అసలు దోషులు నోరే విప్పడం లేదని, ఏం అడిగినా మౌనమే సమాధానం అని తీహార్ జైలు అధికారులు తెలియజేస్తున్నారు. నేరం రుజువై శిక్ష ఖాయమైనా ఎప్పటి నుంచో అమలు కాకపోవడం, ఎట్టకేలకు కోర్టు డెత్ వారెంటు జారీ చేసినా అది కూడా వాయిదా పడడంతో రెండోసారి డెత్ వారెంట్లు జారీ చేసినా తమ శిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందన్న ధీమా దోషుల్లో కనిపిస్తోందని జైలు అధికారులు చెబుతున్నారు.