Krishna District: కోతుల బెడదకు పులి బొమ్మలతో విరుగుడు!
- రైతులు, వ్యాపారుల చిట్కా
- కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సమస్య
- పండ్ల తోటలు, దుకాణాలపై బొమ్మల ఏర్పాటు
పంటలు కాపాడుకోవడానికి రైతులు రకరకాల చిట్కాలు ప్రయోగిస్తుంటారు. ముఖ్యంగా గింజ ధాన్యాలు, చెరకు తోటలు, పండ్ల తోటలకు కోతులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, పక్షుల బెడద సాధారణంగా ఉంటుంది. వీటి నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు పొలాల్లో దిష్టిబొమ్మలు ఏర్పాటు చేయడం, కర్రకు గుడ్డలు కట్టి పొలాల్లో పాతడం, డప్పువాయిద్యం చేస్తూ జంతువులను బెదిరించేలా చేయడం చేస్తుంటారు.
ఇప్పుడు కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు, వ్యాపారులు ఇటీవల కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు 'పులిబొమ్మ' చిట్కాను ప్రయోగిస్తున్నారు. జిల్లాలోని నూజివీడు, ఆగిపల్లి, వీరవల్లి ప్రాంతాల్లో మామితోటలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో కోతుల బెడద ఇటీవల ఎక్కువయ్యింది. మామిడి తోటల్లో కాయలు తెంపేసి నష్టం కలిగిస్తుండడం, సమీపంలోని ఇళ్లలోకి, షాపుల్లోకి ప్రవేశించి చేతికి దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లడం చేస్తుండంతో స్థానికులు విసిగిపోయారు.
ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచించి పులి బొమ్మలను ఆశ్రయించారు. కోతుల బెడద ఉన్న ప్రాంతంలో పులిబొమ్మలు పెట్టారు. దుకాణాల పైనా, తోటల్లోనూ పులిబొమ్మలు పెట్టడంతో వానరాలు అవి నిజంగా పులులే అని రావడం లేదని, దీంతో వాటి బెడద తమకు తప్పిందని స్థానికులు చెబుతున్నారు.