Khammam District: బాలికపై మాజీ సర్పంచ్ అత్యాచారం.. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
- ఫోన్ చేసుకునేందుకు వచ్చిన బాలికపై మాజీ సర్పంచ్ అఘాయిత్యం
- కేకలు విని లోపలికి వెళ్లిన బాధిత బాలిక తల్లి
- గ్రామస్థులతో కలిసి దాడిచేసిన బాధిత కుటుంబ సభ్యులు
బాలికపై అత్యాచారం చేసిన మాజీ సర్పంచ్‌కు గ్రామస్థులు దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తన తండ్రికి ఫోన్ చేసుకునేందుకు మాజీ సర్పంచ్ కేతిరెడ్డి కోటిరెడ్డి (63) ఇంటికి వెళ్లింది. ఫోన్ మాట్లాడిన అనంతరం వెళ్లిపోతున్న బాలికను పిలిచిన కేతిరెడ్డి డబ్బులిచ్చి మిరపకాయలు తీసుకురమ్మని దుకాణానికి పంపించాడు. అవి తీసుకుని తిరిగొచ్చిన బాలికపై కోటిరెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు.
కుమార్తె వెళ్లి చాలాసేపైనా ఇంటికి రాకపోవడంతో ఆమెను వెతుక్కుంటూ తల్లి బయలుదేరింది. అదే సమయంలో కేతిరెడ్డి ఇంటి నుంచి కేకలు వినిపించడంతో లోపలికి వెళ్లింది. తల్లిని చూసిన బాధిత బాలిక ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి కోటిరెడ్డిని పట్టుకుని చితకబాదారు.
వారి నుంచి తప్పించుకున్న కోటిరెడ్డి మరో గదిలోకి వెళ్లి లోపలి నుంచి తలుపులు వేసుకున్నాడు. అయినా వదలని గ్రామస్థులు అతడిని బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన అతడిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.