YSRCP: ఏపీ చట్ట సభల్లో ఇది చాలా బాధాకరమైన రోజు: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

  • చట్ట సభలకు టీడీపీ విలువ ఇవ్వడం లేదు
  • యనమల నీతి నియమాలు మరిచారు
  • గ్యాలరీలో కూర్చుని చంద్రబాబు మండలి ఛైర్మన్ ను ప్రభావితం చేశారు

చట్టసభలు, ప్రజాస్వామ్యంపై గౌరవం లేకుండా టీడీపీ వ్యవహరించిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు బ్లాక్ డే కంటే ఘోరమైన రోజని అభివర్ణించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండు బిల్లులను టీడీపీ అడ్డుకుందన్నారు. రూల్ 71 అడ్డం పెట్టుకుని టీడీపీ డ్రామా ఆడిందని ఆరోపించారు. మండలి ఛైర్మన్ కు ఎదురుగా చంద్రబాబు, ఎమ్మెల్యేలు గ్యాలరీలో కూర్చుని ఆయనను ప్రభావితం చేశారని ఆరోపించారు.

13 జిల్లాల అభివృద్ధికి తమ ప్రభుత్వం తాపత్రయపడుతోందని చెప్పారు. అందరికీ నీతినియమాలు చెప్పే యనమల అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై నిబంధనలను పాటించలేదన్నారు. బీఏసీ నిర్ణయం, ఎజెండా అంశాలను విస్మరిస్తూ.. టీడీపీ సభ్యులు వ్యవహరించారన్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడానికి మండలి ఛైర్మన్ తన విచక్షణ ఉపయోగించారని, అదీ.. చంద్రబాబును చూసి చెప్పారన్నారు. దీనిని బట్టి ఛైర్మన్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని స్పష్టమవుతోందని  పేర్కొన్నారు. చట్ట సభల్లో ఈ తరహా వైఖరులు సబబు కాదన్నారు.

  • Loading...

More Telugu News