carona virus: భారత్ లో కరోనా వైరస్ ను గుర్తించేందుకు థర్మల్ స్క్రీనింగ్... ఇప్పటివరకు కేసులు లేవన్న కేంద్రం
- చైనాను హడలెత్తిస్తున్న కరోనా వైరస్
- ఇప్పటివరకు 9 మంది మృతి
- భారత్ విమానాశ్రయాల్లో ఆరోగ్య తనిఖీలు
ప్రమాదకరమైన కరోనా వైరస్ చైనాలో వేగంగా ప్రబలుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అక్కడ 9 మంది మరణించగా, 400కి పైగా కేసులు నమోదయ్యాయి. తైవాన్, హాంకాంగ్ ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ ఉనికిని గుర్తించారు. అయితే, చైనా తదితర ప్రాంతాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికుల్లో ఎవరైనా కరోనా వైరస్ ను కలిగి ఉంటే వారిని గుర్తించేందుకు విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ మాట్లాడుతూ, కరోనా వైరస్ ప్రభావం భారత్ లో లేదని వెల్లడించారు. దేశంలోని కీలక విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థ ద్వారా కరోనా వైరస్ బాధితులను గుర్తించే ఏర్పాట్లు చేశామని వివరించారు. చైనాలోని భారత ఎంబసీ నుంచి కూడా తాజా సమాచారం సేకరిస్తున్నామని ప్రీతి సుడాన్ తెలిపారు.