Andhra Pradesh: బీటెక్ రవి వ్యాఖ్యలపై మంత్రి విశ్వరూప్ ఆగ్రహం
- ఎమ్మెల్సీలను కొనాల్సిన ఆవశ్యకత మా పార్టీకి లేదు
- గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలను కొన్న చరిత్ర చంద్రబాబుది
- రవి వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించాలని చైర్మన్ కు వినతి
వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాద, ప్రతివాదనలు వాడీవేడిగా సాగాయి. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రి పినిపె విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలను కొనాల్సిన ఆవశ్యకత తమ పార్టీకి లేదన్నారు. ఈ విషయంలో బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమన్నారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించాలని చైర్మన్ ను కోరారు.
ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదన్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను కొన్న చరిత్ర చంద్రబాబుదేనని విమర్శించారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని చెప్పారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాలనే భగవంతుడు గత ఎన్నికల్లో ఆ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను మాత్రమే గెలిపించాడని ఎద్దేవా చేశారు.