Jagan: వేసుకున్న బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఎవరూ ఏమీ చేయలేరు: జేసీ దివాకర్ రెడ్డి

- జగన్ విషయంలో కేంద్రం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది
- పవన్ కల్యాణ్ ఒక తిక్క వ్యక్తి
- రెండేళ్లకో, ఐదేళ్లకో ప్రత్యేక రాయలసీమ వచ్చి తీరాల్సిందే
రాజధాని విషయంలో అసెంబ్లీ తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని... అయితే, తమకు కేంద్రం, కోర్టులు ఉన్నాయని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం వేచి చూసే ధోరణని అవలంబిస్తోందని చెప్పారు. సచివాలయంతో సామాన్య ప్రజలకు పని లేదని మంత్రులు అంటున్నారని మండిపడ్డారు. రాయలసీమ నుంచి విశాఖకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదని అన్నారు. హైకోర్టుతో రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిక్క వ్యక్తి అని... ఆయన చెప్పేంత వరకు ఎవరీకి ఏదీ తెలియదని అనుకుంటుంటారని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంతంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అందర్నీ పోలీసులు చావబాదుతున్నారని... బ్రిటీష్ వారి హయాంలో కూడా ఇలా జరగలేదని అన్నారు. ప్రత్యేక రాయలసీమకు జగన్ శంకుస్థాపన చేశారని... రెండేళ్లకో, ఐదేళ్లకో ప్రత్యేక రాయలసీమ వచ్చి తీరాల్సిందేనని చెప్పారు.
జగన్ తాను అనుకున్నదే జరగాలని అనుకుంటున్నారని... ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదనుకుంటున్నారని జేసీ విమర్శించారు. వేసుకున్న బట్టలు విప్పేసి తిరుగుతామంటే ఎవరూ ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు.