Yanamala: బిల్లును అడ్డుకునే అస్త్రాలు మా వద్ద ఉన్నాయి: యనమల
- ఛైర్మన్ ఏం నిర్ణయిస్తారో దాన్ని బట్టే మా వ్యూహం ఉంటుంది
- ప్రభుత్వ బిల్లులపై చర్చ జరిపి సెలెక్ట్ కమిటీకి పంపే వెసులుబాటు ఉంటుంది
- రాష్ట్ర చరిత్రలో తొలిసారి మండలిలో రూల్ 71 ప్రయోగం జరిగింది
- రూల్ 71 పై జరిగిన చర్చ ఓటింగ్‌లోనూ మా తీర్మానం నెగ్గింది
శాసన మండలి ఛైర్మన్ ఏం నిర్ణయిస్తారో దాన్ని బట్టే టీడీపీ వ్యూహం ఉంటుందని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రూల్ 71 లాంటి అస్త్రాలు తమ వద్ద చాలా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ బిల్లులపై చర్చ జరిపి సెలెక్ట్ కమిటీకి పంపే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అడ్డుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారి మండలిలో రూల్ 71 ప్రయోగం జరిగిందని యనమల తెలిపారు. మంత్రి వర్గం నిర్ణయం తప్పైతే దానిని సభలో ఆమోదించవచ్చా? లేదా? అని తేల్చేదే రూల్ 71 అని వివరించారు. రూల్ 71పై జరిగిన చర్చ ఓటింగ్‌లోనూ తమ తీర్మానం నెగ్గిందని గుర్తు చేశారు. మంత్రి వర్గ నిర్ణయాలు తప్పని చట్ట సభలో రుజువైందని, వికేంద్రీకరణ బిల్లు కూడా తప్పని స్పష్టమైందని అన్నారు.