Rajinikanth: క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు: రజనీకాంత్
- పెరియార్ పై రజనీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ పత్రికలో కథనం
- క్షమాపణలు చెప్పాలని ద్రావిడర్ విడుదలై కజగం డిమాండ్
- తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న రజనీ
ద్రవిడ పితామహుడు పెరియార్ ను ఉద్దేశించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం తమిళనాడులో కలకలం రేపుతోంది. 1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీలో నగ్నంగా వున్న సీతారాముల విగ్రహాలను పెరియార్ తీసుకెళ్లారంటూ రజనీ వ్యాఖ్యానించినట్టుగా సదరు పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై ద్రావిడర్ విడుదలై కజగం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో రజనీపై ఫిర్యాదులు చేశారు. రజనీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో రజనీకాంత్ స్పందించారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను చేయని వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని... క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని అన్నారు.