Amaravati: అమరావతిని తొలగిస్తానని నేను ఎన్నడైనా చెప్పానా?: వైఎస్ జగన్
- విపక్షాల ప్రచారం పూర్తి అవాస్తవం
- అన్ని ప్రాంతాల అభివృద్ధే నా లక్ష్యం
- గుంటూరు, విజయవాడ మధ్య మహానగరం రాబోతుంది
- ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగనివ్వబోను
- అసెంబ్లీలో వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తొలగిస్తున్నామని విపక్షాలు చేస్తున్న ప్రచారం పూర్తి అవాస్తవమని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, అమరావతి రాజధానిగానే ఉంటుందని, మరో రెండు రాజధానులను కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సభకు తెలిపారు.
అసలు అమరావతి అనే ప్రాంతం విజయవాడలోనూ లేదని, గుంటూరులోనూ లేదని వ్యాఖ్యానించిన జగన్, గత ప్రభుత్వం చూపిన గ్రాఫిక్స్ వల్ల అమరావతి అన్న నగరం ఏర్పడిందని ప్రజలను నమ్మించారని అన్నారు. ఈ సందర్భంగా శివరామకృష్ణన్ కమిటీ సహా పలు కమిటీలు ఇచ్చిన రిపోర్టుల వీడియోలను జగన్ అసెంబ్లీలో చూపించారు.
అమరావతి అంటే తనకు ఇష్టం లేదని తెలుగుదేశం చేస్తున్న ప్రచారాన్ని జగన్ తిప్పికొట్టారు. ఈ ప్రాంతమంటే తనకెంతో ఇష్టమని, అందుకే తాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని, అంత ప్రేమ ఉన్న చంద్రబాబుకు ఇంతవరకూ సొంత ఇల్లే లేదని గుర్తు చేశారు. తనకు ఇష్టం లేకుంటే, ఇక్కడే అసెంబ్లీ సమావేశాలను ఎందుకు పెడతానని ప్రశ్నించారు.
భవిష్యత్తులో విజయవాడ, గుంటూరుల మధ్య ఓ మహానగరం ఏర్పడుతుందని, అందుకు ఏం చేయాలో తనకు తెలుసునని, రాజధాని నిమిత్తం భూములిచ్చిన ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరుగబోదని, గత ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం కన్నా అధిక పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాలతో ప్రజలు దగ్గరవుతుంటే, చంద్రబాబు తట్టుకోలేకున్నారని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దుతోందని, అమరావతి అంటూ చెప్పుకుంటున్న ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవమని, మొత్తం లావాదేవీలనూ వెలుగులోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం, భవిష్యత్తులో మరో ఉద్యమం రాకుండా, పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా దృష్టిని సారించిన తమ ప్రభుత్వం, పలు కమిటీలను వేసి, వాటి నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
అమరావతిని చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ మాదిరిగా కట్టాలంటే, సాధారణ భవన నిర్మాణ పనులు జరిగే వేగానికి ఐదు రెట్ల వేగంగా చేస్తే, 30 నుంచి 35 ఏళ్లు పడుతుందని, ఇప్పుడు లక్ష కోట్లుగా ఉన్న అంచనా వ్యయం, అప్పటికి ఎన్నో రెట్లు పెరిగిపోతుందని జగన్ వ్యాఖ్యానించారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టని ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు.